నాకు ఎవరైనా ఏదైనా చెప్పారనుకొండి. వారితో నాకున్న చనువు కొద్ది వాదించడానికి ప్రయత్నం చేస్తాను. పరిచయం లేకపొతే వారికి దూరంగా ఉండటానికే ప్రయత్నం చేస్తాను. నా పరిధిలో చిరంజీవి అభిమానులు ఎక్కువ. అది బ్రేక్ చెయ్యడానికి చిరంజీవిని ఘాటుగానే విమర్శిస్తాను.విమర్శకుడిగా వుంటేనే నిజాలు బయటకు వస్తాయి. నాది ద్వేషంతో కూడుకున్న విమర్శలు కాదు. వాదించడానికి మాత్రమే విమర్శలు చేసినా, నాది పైచేయి అనిపించుకోవడానికి లేనివి సృష్టించను.
ఇంటర్నెట్ లో నేను విమర్శకుడిగా వుండవలసిన అవసరం నాకు కనిపించ లేదు. ద్వేషంతో కూడిన విమర్శలకు మరింత ఆజ్యం పోసినవాడిని అవుతానని తక్కువగా చేస్తూ వుంటాను. అలా చేసిన రెండు మూడు విమర్శలకే నన్ను కుల కోణంలో చూడటం మొదలు పెట్టి, ఇదే నీ బ్లాగుకు లాస్ట్ విజిట్ అంటూ కామెంట్ చేసినోళ్ళు కూడా వున్నారు. అటువంటి వారికి బ్లాగు వ్రాసుకునేది నాకోసం కాని నీ కోసం కాదు అని గట్టిగా సమాధానం చెప్పాలి అని వున్నా. నా అభిప్రాయం ఎవరో చదివారు అనే ఫీలింగ్ నా బ్లాగుకు ఇంధనం అనే భ్రమ నుంచి పూర్తిగా బయటకు రాలేక పోవడం వలన అప్పుడు మౌనం వహించ వలసింది.
చిరంజీవి స్వార్ధపరుడు. ముఖ్యమంత్రి పదవి హోదాగా భావిస్తూ ముఖ్యమంత్రి అయిపోదామనే ఆశతోనే రాజకీయాల లోకి వచ్చాడు తప్ప ప్రజాసేవ కోసం కాదు. రాజకీయల ద్వారా ప్రజాసేవ అసాధ్యం. తప్పో ఒప్పో రాజకీయాలలో చంద్రబాబులానో, వై.యస్.ఆర్ లానో వుండాలి. రాజకీయాలలో “నాకు సొమ్ము అక్కర్లేదు, నాకు సొమ్ము దోచుకొనే అవసరం లేదు” అంటే కుదరదు. కొందరు నాయకులు చిరంజీవి మీద అభిమానంతోనో, చిరంజీవికి దగ్గరయ్యి లబ్ది పొందుదామనో చేసిన ఖర్చుకు ఎవరు బాధ్యులు ? వారు దోచుకుంటే చిరంజీవి దోచుకున్నట్టు కాదా ? .. ఇంత చిన్న లాజిక్ ను చిరంజీవి విస్మరించడంలో నాకు ఎంతో స్వార్ధం కనిపిస్తుంది.
నేను ఇదే విషయాన్ని బాగా చనువున్న ఫ్రెండ్ తో అంటే “ఎవరు స్వార్దపరులు కాదు? నువ్వు కాదా ?” అని ప్రశ్నించాడు.
నేను పక్కా స్వార్దపరుడిని. అందులో అనుమానం ఏమీ లేదు. వివిధ కారణాలతో ఆయనకు దురాభిమానులు వున్నా, చిరంజీవి అంటే ఒక ఆదర్శమైన వ్యక్తి. ఆయన నిస్వార్దంగా వుండవలసిన ఆదరణ ప్రజలు ఇచ్చారు. ఋణం తీర్చు కోవడం అంటే ఇదా ? అని నేను అంటే “ఆయన మీకు కావలసిన ఎంటరటైనమెంట్ ఇచ్చాడు కాబట్టి ఆదరించారు కాని వూరికినే ఆదరించారా ?”. అని తిరిగి ప్రశ్న వచ్చింది.
మరి ఆ ఆదరణను రాజకీయ అధికారంగా మార్చు కోవాలను కోవడం తప్పే కదా అని నేను అంటే “జీవితం అంటే అదే నాయన” అని సమాధానం ఇవ్వకుండా తప్పించు కున్నాడు.


