ఏడుపు

ఎవరి ఏడుపు వాడిది !


బ్లాగు స్టార్ట్ చెయ్యకముందు ఎక్కడైనా చదివింది ’కిక్’ ఇస్తే కంప్యూటర్ లో దాచుకోవడం అలవాటు వుండేది. కంప్యూటర్ మార్చినప్పుడల్లా అవి పోయేవి అనుకొండి, అదే వేరే విషయం. ఎప్పుడో దాచుకున్న ఈ పాయింట్స్ ఇప్పుడు నా బ్లాగులో దాచుకోవాలనే వుద్దేశంతో మరియు ఇంటరెస్ట్ వున్నవాళ్ళు చదువుకుంటారని ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.

 • ప్రపంచలో ఎవరి ఏడుపు వాడిది. ఒకడి ఏడుపు ఇంకొకడికి అర్దం కాదు.
 • మనిషి ఏడుస్తూ పుడతాడు. ఏడిపిస్తూ చనిపొతాడు. మధ్యలోనూ ఏడుస్తాడు.
 • జీవితమంటే ఏడుపు నుంచి ఏడుపు వరకు అని వేదాంతులు చెపుతారు.
 • ఇందులో తెలుగువాడి ఏడుపు మరీ చిత్రమైంది. ఒక పట్టానా అర్దమై చావదు.
 • తెలుగు “వాడి” నిఘంటువులో ఏడవడానికి, ఏడిపించడానికి చిత్రమైన అర్దాలు వున్నాయి.
 • తన కష్టాలకో, ఎదుటివాడి కష్టాలకో ఏడవడం మామూలు పద్దతి. కష్టాలకు సబంధం లేకుండా వచ్చే ఏడుపే గమ్మత్తయింది.
 • ఇందులో ఎదుటివాడు ఎంత బాగుపడుతుంటే ఇవతలి వాడికి అంత ఏడుపోస్తుంటుంది! అయితే కన్నీళ్ళు కనపడవు. ఏడిపించడం అంటే బాధపెట్టడం!!
 • ఏడుపునూ ఎగతాళి చేసే శక్తి ఒక్క తెలుగువాడికి మాత్రమే వుంది. ఏదైనా తనకు నచ్చినట్టు లేకపొతే – “ఏడ్చి మొహం కడుక్కున్నట్టు వుంది” అంటాడు.
 • నవ్వే మొహాలు కొన్నయితే ఏడుపుగొట్టు మొహాలు మరికొన్ని. ఈ గొడవంతా ఎందుకు ఎప్పుడూ ఏడుపు గొట్టు మొహంతోనే వుంటే పోలా అనే మహానుభావులు ఎందరో.
 • వెనకటికి ఓ పెద్దమనిషి “ఏడుస్తున్నావెందుకయ్యా ” అంటే – “ఒకనాడు నా మొగం నవ్వి చచ్చిందా?” అన్నాడట! ఏడుపువల్ల సాధించలేనిది లేదు.
 • ఒక్కో నవ్వు ఒక్కో ఏడుపుకు కారణం అవుతాది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు ఏడ్చానని ఓ ఇల్లాలు చెప్పలేదూ !
 • ఎవరి ఏడుపు వాళ్ళే ఏడవచ్చు. ఒకరి ఏడుపు ఇంకొకళ్ళు ఏడ్చే సౌకర్యం వుంది.
 • ఒక్కో సందర్భానికి ఒక్కో ఏడుపు, దానికో స్థాయి వుంటాయి.
 • ఇలా ఎటు చూసినా ఏడుపును తక్కువ అంచానా వేయడానికి వీల్లేదు. ఎంతవాడికి అంత ఏడుపు.