‘అజ్ఞాతవాసి’ 5 గంటల్లో అత్యధిక లైక్స్ (310K) సంపాదించిన తెలుగు మూవీ టీజర్ గా రికార్డ్ నమోదు చేసింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. గతంలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ‘మధురాపురి సదన.. మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా.. చరణాగతం కృష్ణా..’ అంటూ సాగే కృతితో కాశీ పట్టణాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. పవన్ ఇందులో అత్తారింటికి దారేది చిత్రంలో వున్నట్టే చాలా స్టైలిష్‌గా కనిపించారు. పవన్‌కల్యాణ్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, త్రివిక్రమ్ శైలి కామెడీకి సినిమాలో ఏ మాత్రం కొదవ లేదని అర్థమవుతోంది. ‘ఓ మై గాడ్’ అనే ఒక్క డైలాగ్‌ను మాత్రమే పవన్ ఇందులో పలికారు. ‘వీడి చర్యలు ఊహాతీతం..’ అని మురళీశర్మ అంటే ‘that’s the beauty’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ మంచి కిక్ ఇచ్చింది.
ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఖుష్బూ కీలక పాత్రలో & వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.